శ్రీ వెంకటేశతాపన్యుపనిషత్ - అమృత కలశం

 

 హైదరాబాద్ లోని కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తన ప్రవచనంలో శ్రీ వెంకటేశ్వర సాహిత్య సర్వస్వము అను బృహత్ గ్రంథం లో  శ్రీనివాసుడి భక్తుల పాలిటి అమృతకలశం  శ్రీ వెంకటేశ్వర తాపన్యుపనిషత్ అని చెప్ప బడినదని, అధ్యయనం చేసి ఉపాసనా విధానాన్ని సాధిస్తే, కష్టాలు తొలగి, సూర్య, వాయు చంద్రాదులు కూడా పొందలేని మహోన్నత స్థితిని భక్తులు పొందగలరని తెలియజేశారు.


జీవితం పై విరక్తి చెంది రాజ్యభారాన్ని తన తమ్ముళ్లకు అప్పగించి జనక మహారాజు తపోవనాలకు వెళ్లగా అక్కడ మహర్షి శాఖాయన్యున్ని దర్శించి ఆయనను స్తుతించగా అందులకు ఆయన సంతసించి ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. జనక మహరాజు భక్తి శ్రధ్దలతో
కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు బానిసైన ఈ శరీరంతో కమోపభోగాలు అనుభవించాలనే కోరిక లేదు. ద్యుమ్న, ప్రద్యుమ్న, ఉగ్రసేన, అంబరీశ, ఇంద్రద్యుమ్న తదితర చక్రవర్తులే అన్ని భోగాలను వదిలేసి వెళ్లిపోయారు కదా! ఆ భోగాల మీద ఆసక్తి తనకు లేదని చీకటి నూతిలో కప్పలా సంసార బంధంలో కొట్టుమిట్టాడు చున్న తనను ఈ బంధం నుండి విముక్తి చేయమని జనకుడు ప్రార్థించాడు. ఇందుకు భగవద్భక్తి యోగం తప్ప మరో మార్గం లేదని శాఖాయన్యుడు జనకునికి బోధించిన భక్తి సాధనా మార్గమే శ్రీ వేంకటేశ తాపన్యుపనిషత్ లోని సారం. 

శ్రీ వెంకటేషోద్భవము గురించి స్కాంద పురాణమేమి చెబుతోందంటే మొట్టమొదట 'శ్రీవేంకటేశ' అని వెలువడిన మంత్రాన్ని బ్రహ్మ విన్నాడని, తర్వాత వేయి శిరస్సులతో ప్రకాశించే విరాట పురుషుడు చతుర్భుజాలు, శంఖ చక్ర హస్తాలతో పీతాంబరదారియైన వెంకటేశుడు సాక్షాత్కరించి 'శ్రీ వెంకటేశాయనమః' అను అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడని, ఉపాసించడానికి మహా చక్ర విధానాన్ని బోధించాడని, వృత్తాకారం లోని సుదర్శన చక్ర రూపంలో నాభి స్థానం నుండి ఒక్కో చక్రంలో ఈ మంత్రాక్షరాలు శడక్షరాల దళాలు, అష్టాక్షరాల దళాలు, ద్వాదశాక్షర దళాలు, షోడశాక్షర దళాలు, చతుర్విమ్శాక్షర దళాలు, చివరగా 32 అక్షరాల దళాలు ఉండాలని బోధించగా బ్రహ్మ వెంకటాచలం లో ఉపాసన చేయగా అతనికి సృష్టి చేసే శక్తి లభించిందని తెలియజేస్తూ ఎలా స్త్రోత్రం చేయాలో కూడా వివరించారు.
'ఓం భూర్భువస్సువః...' భూనభోంతరాళాలు అవరించి ఉన్నవాడు, ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆయనే లక్ష్మీ, సరస్వతి, గౌరి, వేదములుగా, వేదశాఖలుగా, ఏకాదశ రుద్రులుగా, ద్వాదశ ఆదిత్యులుగా కనిపించే సర్వదేవతాత్మకుడైన ఆ నారాయణుడే వెంకటేశుఁడు. కావున 'వేంకటేశ' అంటే పాపాలు దహించే వాడని, 'శ్రీ' ని రమగా వక్షస్థలంలో ధరించేవాడు కనుక 'శ్రీనివాసుడని' వేదవేద్యుడు కనుక 'గోవింద' అని, ఎవరి నోట భక్తి భావంతో 'శ్రీ వేంకటేశ' అని వినబడుతుందో వాళ్లకి దేవతలు నమస్కరిస్తారని, ఈ ఉపాసనలో మంత్రం, యంత్రం, తంత్రం ఉన్నాయని,  గురూపదేశంతో ఈ మంత్రాన్ని ఉపాసిస్తే స్వామి సాక్షాత్కరిస్తాడాని తెలియ జేశారు. నారాయణోపనిషత్ లో నున్న మంత్రాల్లాగా శ్రీ వెంకటేశ్వర తాపన్యుపనిషత్ లో కూడా మంత్రాలు నిక్షిప్తమై ఉన్నందున అధ్యయనం చేసి ఉపాసనా విధానాన్ని సాధిస్తే సూర్య, వాయు చంద్రాదులు కూడా పొందలేని మహోన్నత స్థితిని భక్తులు పొందగలరని తెలియజేశారు.

ఈ విధంగా శ్రీ శర్మ గారు తాపిన్యుపనిషత్తు పూర్వ ఉత్తర భాగాలపై భక్తి రసభరితమైన ప్రవచనం చేయగా వారిని పూతలపట్టు అనసూయ మరియు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి దంపతులు సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు శ్రీ వేంకటేశ్వరుని ఉపాసనకి సంబంధించిన ఈ తాపన్యుపనిషత్ గురించి విని దాని సంస్కృత మూలాన్ని సేకరించి ఎందరో మహా పండితులను సంప్రదించి తెలుగులో అనువదింపజేసి పూతలపట్టు అనసూయ గారితో ముద్రింపజేసి భక్తులకు కానుకగా నొసంగినారు. భక్తులు వారి వారి కష్టాలనుండి విముక్తి పొందుటకు పై ఉపాసనా మార్గాన్ని అనుసరించి కృతార్థులు కాగలరని ఆశిస్తున్నారు. కావున వారు నిజంగా అభినందనీయులు. వారిపై శ్రీ వెంకటేశుని కృపా కటాక్షాల జల్లులు ఎల్లవేళలా వర్షించాలని కోరుకుంటున్నాము.

కామెంట్‌లు