ఆస్తుల నమోదు ప్రక్రియ వివరాలు


ఆస్తుల నమోదు ప్రక్రియ మొదలైంది. సమాచారార్థం వివరాలు ఇవ్వనైనవి. చదవండి తెలుసుకొండి, సన్నద్ధులు కండీ.  • ఆస్తుల నమోదుకు ఇంటింటికీ వస్తారు.

 • యజమాని ఇంట్లో లేకపోతే ఫోన్‌లో వివరాల సేకరిస్తారు. 

 • పీటీఐఎన్‌ ఉన్న నిర్మాణాలన్నీ నమోదు. 

 • ప్రతి యజమానికి నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీ రికార్డు

 • అందుబాటులోకి ప్రత్యేక యాప్‌


రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ జోరందుకుంది. దీనిని సులభతరం చేసేందుకు, వివరాల నమోదుకు ప్రభుత్వం బుధవారం నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌(న్యాప్‌) అనే ప్రత్యేక యాప్‌ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటి వద్దకు అధికారులు స్వయంగా వచ్చి వివరాలను, నిర్మాణ ఫొటోను తీసుకుని ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. యజమాని వివరాలతో పాటు కులం, నిర్మాణ వినియోగం, ఆస్తి సంక్రమించిన విధానంతో పాటు విద్యుత్‌, నీటి బిల్లుల సమాచారం సహా మొత్తం 52 అంశాలను సేకరిస్తారు. ప్రతి ఆస్తికీ ఆధార్‌ గుర్తింపు సంఖ్యను అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌ సహా ఇతర నగరాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు- పీటీఐఎన్‌) కలిగిన నిర్మాణాల వివరాలను సేకరించే కార్యక్రమం మొదలైంది. అక్టోబరు 12లోపు పీటీఐఎన్‌ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


ప్రత్యేకంగా వివరాల సేకరణ ఎందుకంటే...


 


పట్టణాలు, నగరాల్లోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ప్రతి యజమానికి నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీ రికార్డు (ఎన్‌ఏజీపీఆర్‌)ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రికార్డు కోసం యజమానుల నుంచి సమగ్రమైన వివరాలను సేకరిస్తున్నట్లు పురపాలకశాఖ పేర్కొంది. యజమానులకు సంబంధించి ఆస్తిపన్ను సంఖ్యతో పాటు కొన్ని సాధారణ వివరాలు మాత్రం తమ వద్ద ఉన్నాయని ఇతర వివరాల కోసం ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పుల నేపథ్యంలో కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను రికార్డులను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో అనుసంధానం చేస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యుటేషన్‌ పూర్తి చేసేందుకు వీలుగా ఆస్తుల వివరాలు పక్కాగా ఉండేలా చూస్తున్నారు. నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీ రికార్డు భవిష్యత్తులో క్రయ, విక్రయాలకు కీలక రికార్డుగా ఉంటుంది. ఎన్‌ఏజీపీఆర్‌ ముసాయిదా రికార్డులను వార్డు కమిటీ ముందుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిపై విచారించి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం తుది జాబితా సిద్ధమవుతుంది.


 


కిరాయిదారుల వివరాలు నమోదు చేయరు..


 


సర్వే సమయంలో యజమాని తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ‘‘యజమాని అందుబాటులో లేకుంటే కుటుంబ సభ్యుల నుంచి వివరాలను తీసుకుంటాం. కిరాయిదారులుంటే వారి నుంచి యజమాని ఫోన్‌ నంబరు తీసుకుని అవసరమైన సమాచారం సేకరిస్తాం. ఫోన్‌లోనూ అందుబాటులోకి రాని యజమానుల కోసం మున్ముందు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌ లింకును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఆస్తుల వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉండొచ్చు. దీనిపై పూర్తిగా స్పష్టత రాలేదు. సర్వే జరుగుతున్న క్రమంలో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా నిర్ణయం ఉండొచ్చు’’ అని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఆస్తిపన్ను రికార్డులో పేరు ఉన్న యజమాని వివరాలను నమోదు చేస్తారు. అద్దెకు ఉన్నవారి వివరాలు లేదా లీజుకు తీసుకున్నవారి వివరాలను నమోదు చేయరు.


 


పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు


పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో వివరాల సేకరణకు పర్యవేక్షకులను నియమించారు. రాష్ట్రంలోని జిల్లాలను 7 యూనిట్లుగా విభజించి పురపాలక శాఖ సీనియర్‌ అధికారి సహా మరో ముగ్గురు అధికారులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. సీడీఎంఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


 


గ్రామ పంచాయతీల్లో ఇలా...


గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని నిర్మాణాలను నమోదు చేస్తారు. నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌ యాప్‌ పంచాయతీ కార్యదర్శులకూ అందుబాటులోకి వచ్చింది. జిల్లా పరిషత్‌ సీఈవో, డిప్యూటీ సీఈవో, గ్రామపంచాయతీల్లో నిర్మాణాల సేకరణ వివరాలను పర్యవేక్షించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ రఘునందనరావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.  జిల్లా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి రోజుకు 70 నిర్మాణాలను నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.


 


సేకరించే వివరాలు ఇలా... • యజమాని పేరు, కులం, ఇంటి నంబరు, చిరునామా, నిర్మాణ వినియోగం (వాణిజ్యం, రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌-వాణిజ్యం) • ఆస్తి విస్తీర్ణం (చదరపు గజాల్లో); నిర్మాణ స్థలం (చదరపు అడుగుల్లో)

 • ఆస్తిపన్ను మదింపు సంవత్సరం, ఆస్తి ఎలా వచ్చింది (భాగస్వామ్యం, వారసత్వం, గిఫ్ట్‌, కొనుగోలు)

 • భూమి స్వభావం (ఆబాది, ప్రైవేటు, ప్రభుత్వం, అసైన్డ్‌ భూమి)

 • యజమాని ఫొటో, యజమాని గుర్తింపు ఆధారం

 • పట్టాదారు పాసుపుస్తకం/ ఆహార భద్రత కార్డు/ జనధన్‌ ఖాతా/ బ్యాంకు ఖాతా/ఆధార్‌ కార్డు

 • వయసు, మెయిల్‌ఐడీ, విద్యుత్‌ కనెక్షన్‌ నంబరు, వాటర్‌ కనెక్షన్‌ నంబరు

 •  ఓటరు గుర్తింపు కార్డు, ల్యాండ్‌ మార్కు, కుటుంబ సభ్యుల వివరాలు

 • ఫొటో తీసుకోవడంపై అభ్యంతరం ఉంటే యజమాని తిరస్కరించవచ్చు.


 


అక్కడక్కడా సాంకేతిక సమస్యలు


 


అస్తుల నమోదులో అక్కడక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల యాప్‌ డౌన్‌లోడ్‌ కాలేదు. ఒక్కోసారి సర్వర్‌ నెమ్మదిస్తుండడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని గ్రామాల్లో కార్యదర్శులు చెబుతున్నారు. గురువారం నాటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. ఆస్తుల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ ఇంతక్రితం దాకా గ్రామ కార్యదర్శులు తమవద్ద ఉన్న కంప్యూటర్ల ద్వారా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆస్తులను భౌతికంగా పరిశీలించి, వాటికి కొలతలు తీసుకొని, ఇంటి యజమానుల వివరాలు సేకరించి వాటన్నింటినీ కంప్యూటర్లో నమోదు చేసేవారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా వచ్చిన వివరాలను విశ్లేషించడం కష్టమవుతోంది. దాంతోపాటు నమోదు ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఇప్పుడు యాప్‌ అందుబాటులోకి రావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడికక్కడే వివరాలన్నీ నమోదు చేయవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి టెలీ కాన్ఫరెన్సుల్లో అధికారులు ఆదేశాలు తప్ప మార్గదర్శకాలు ఏవీ ఇవ్వలేదని, దీనివల్ల కొంత అయోమయం నెలకొందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఈ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు గురువారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్ని జిల్లాల బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. అక్టోబరు 10 కల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. ఇది సజావుగా, నిర్దేశిత సమయానికల్లా పూర్తిచేసేందుకు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.


(మాకు తెలిసిన సమాచారం పొందుపరచాము. మరిన్ని వివరాలకు తెలంగాణ రాష్ట్ర ఆధీకృత వెబ్సైట్ ను దర్శించండి...) 


కామెంట్‌లు