వాతావరణ శాఖ వారి హైఅలర్ట్ నోటిస్


హైదరాబాద్ : మ‌ంగ‌ళ‌వారం ఉదయం 8:30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రాగల 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, రాబోయే మూడు రోజుల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. 


దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ర్టానికి వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 


ఇప్ప‌టికే భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న ప్ర‌జ‌లు.. ఈ నాలుగు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లెవ‌రూ త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు కోరారు. హైద‌రాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. 


కామెంట్‌లు