ప్రపంచ పర్యావరణ దినోత్సవం - “పర్యావరణ శేఖరునికి పాలాభిషేకం"

 
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం కరీంనగర్ లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ ముందు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు మానేరు పర్యావరణ సమితి ఆద్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి సేవలను గుర్తించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరము పర్యావరణ పరిరక్షణ గోడ ప్రతులను ఆవిష్కరించారు. మానేరు పర్యావరణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు రాష్ట్ర అవోపా సలహ దారు తోట లక్ష్మణరావు మాట్లాడుతూ భూతాపం పెరిగి, భూగర్భ జలాలు అడుగంటి వరుసగా దుర్భిక్షాన్ని చవిచూస్తున్న తెలంగాణకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో జల సమృధ్ది, వన సంరక్షణ ఒక్కటే మార్గమని ముఖ్య మంత్రి కె.సి.ఆర్ గారు భావించారని, ఆయన దూరదృష్టి స్ఫూర్తిదాయకమైనదని, పర్యావరణం లోని మౌలిక అంశాలైన జల వనరులను కాళేశ్వరం వద్ద గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తైన పీఠభూమి ప్రాంతమైన తెలంగాణ భూముల కొరకు మిషన్ భగీరథ ద్వారా ఎత్తిపోసి సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కె.సి.ఆర్ అని, హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ రూపంతో చేపట్టి ప్రకృతి సమతుల్యత కొరకు అడవులను అభివృద్ధి చేస్తున్నారని, నీరు సమృద్ధిగా ఉంటే పచ్చదనం సమృద్ధిగా పెరుగుతుందని, అడవుల అభివృద్ధితో వానలు కురుస్తాయని, కోతులు వాటి స్థావరాలైన అడవులకు వెళ్లిపోతాయని భావించే వారన్నారు. అందుకే వానలు రావాలి కోతులు పోవాలి అనే నినాదానికి ఆయన కార్యరూపమిచ్చారన్నారు. పారిశ్రామిక కాలుష్యం మురికి కూపంవలె మారినందున మూసినదిని ప్రక్షాలన చేస్తున్నారన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్లెక్సీ బ్యానర్లను, క్యారీ బ్యాగులను నిషేదించి పర్యావరణ పరిరక్షకుడిగా చరిత్రలో శాశ్వత స్థానాన్ని కల్పించుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా క్వారీ బ్యాగులను వాడొద్దనే నినాదంతో జూట్ బ్యాగులను పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోట లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అవోప కార్యదర్శి పాత వెంకటనర్సయ్య, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్యబాబు, తెలంగాణ రాష్ట్ర పర్టిలైజర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్, దేవిశెట్టి రమేశ్, కొమురవెల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు